Chittoor: దుండగుల నుంచి మారణాయుధాలు స్వాధీనం..! 1 y ago
చిత్తూరులోని గాంధీ రోడ్ బుధవారం పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి ఆరుగురు చొరబడ్డారు. దుండగులు చొరబడ్డారన్న సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఉదయం 6:30కి షాప్ ని ముట్టడించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ దుండగులు వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పారు. చిత్తూరు ఎస్పీకి సమాచారం ఇచ్చిన టూ టౌన్ పోలీసులు స్థానికుల సహాయంతో ఆపరేషన్ ప్రారంభించారు.
షాప్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు.. మూడు గంటలకుపైగా శ్రమించారు. స్థానికుల సహాయంతో పోలీసులు ముగ్గురు దుండగులను అదుపులో తీసుకున్నారు. పోలీసులు చూసిన భయంతో భవనం పైనుంచి దూకి మరో దుండగుడు ఆసుపత్రి పాలు అయ్యాడు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ ఆరుగురు దుండగుల్లో ఇద్దరు లోపలే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మినీ వ్యాన్ లో వచ్చిన ఆరుగురు దుండగులు.. ఐడీబీఐ బ్యాంకు ముందే మినీ వ్యాన్ ను పార్క్ చేసి లోపలకి చొరబడ్డారు. లోపల ఉన్న వారి దగ్గర తుపాకులు ఉండటంతో పోలీసులు ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. పోలీసులు ఆపరేషన్ ప్రారంభించి భవనంలో ఉండిపోయిన ఇద్దర్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో డమ్మీ గన్నులతో షాప్ యజమానిని బెదిరించిన దొంగల అసలు కథ బయటపెట్టారు.
ఫర్నిచర్ షాప్ వ్యక్తితో పాటు కేసులో ఏడుగురికి సంబంధం ఉన్నట్లు తేలింది.దుండగుల్లో ముగ్గురు అనంతపురం జిల్లా ఎరుకుల రామాపురం చెందినవారు కాగా.. మరో ముగ్గురు నంద్యాలకు చెందిన వారని గుర్తించారు. చిత్తూరులో షాపు ను నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పించుకున్న ఇద్దరు కోసం గాలిస్తున్నారు. చంద్రశేఖర్ కు ఏస్ఎల్వీ ఫర్నిచర్ కు చెందిన సుబ్రమణ్యం ఎందుకు టార్గెట్ చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.